తనకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, పొంగులేటి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, ఉభయ జిల్లాల ఎమ్మెల్యేలు హాజరవగా.. వారి సమక్షాన ప్రసంగించారు. కేవలం 150 రోజుల్లో ఆరు గ్యారెంటీ లలో ఐదు గ్యారెంటీ లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు. ఎన్నికల అనంతరం రుణమాఫీ, పక్కా ఇళ్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. అప్పటికే ఉన్న వాటిలో కోటి ఉద్యోగాలు పీకారని విమర్శించారు. రాముడి పేరు చెప్పి మత రాజకీయాలు చేస్తోందని చెప్పారు. మతాల చిచ్చు మనకొద్దని, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ప్రజలకు రఘురాం రెడ్డి ని పరిచయం చేసిన రేణుకా చౌదరి
ముఖ్యమంత్రి పాల్గొన్న జన జాతర సభలో సభాధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనoనేని సాంబశివరావు అభ్యర్థన మేరకు రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి .. కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డిని వేదికపై నుంచి ప్రజలందరికీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
అధిష్టానం ఆదేశం తో వచ్చిన ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని అత్యదిక మెజారిటీతో గెలిపించాలన్నారు. వారి ఆస్తులను ఆ రోజుల్లోనే ప్రజలకు, ప్రభుత్వానికి పంచిన గొప్ప వారని గుర్తు చేశారు. రాజ్యసభలో తాను, లోక్ సభలో రఘురాం రెడ్డి, ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఉంటే రాష్ట్రానికి వచ్చే నిధులు ఎవ్వరూ ఆపలేరు అని రేణుక చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత రామ సహాయం రఘురాం రెడ్డికి వచ్చే మెజారిటీ చూసి గల్లీ సందుల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుల గుండెలు అదరాలి అని, అంత గొప్పగా ఫలితం ఇవ్వాలని కోరారు.