Spread the love

సొంతపార్టీ నేతలపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ ను రహస్యంగా కలుస్తున్నారని ఆరోపణ

సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలంటూ ఫైర్

తెలంగాణలో బీజేపీతోనే హిందువులకు రక్షణ అని వెల్లడి

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే హిందువులకు రక్షణ ఏర్పడుతుందని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజా సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే పార్టీలోని సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి ఇంట్లో కూర్చోబెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీనియర్ నేతలు కొందరు సీఎం రేవంత్ తో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోని కీలక నేతలను, ముఖ్యమంత్రిని రహస్యంగా కలిసి మంతనాలు చేస్తున్నారని, ఇలాంటి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఈ చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి రాజా సింగ్ సూచించారు. కాగా, ఇటీవలి కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన రాజా సింగ్.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు.