TEJA NEWS

రాజమండ్రికి ఉమెన్ క్రికెట్ అకాడమి

జాతీయ స్పోర్ట్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం,
రాజమహేంద్రవరంలో ఉమెన్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు కానుందని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్ కె వి టి కళాశాల ఆవరణలో జరిగిన జాతీయ స్పోర్ట్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి భారత హాకీ లెజెండ్‌ మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత హాకీ లెజెండ్‌ మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో మన దేశానికి మూడు బంగారు పతకాలు అందించిన గొప్ప క్రీడాకారుడు ఆయన అని గుర్తు చేశారు. హాకీ క్రీడ ద్వారా ఇండియా పేరుప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటిచెప్పారని కొనియాడారు.

1928,1932, 1936 ధ్యాన్‌ చంద్‌ సారథ్యంలో ఇండియా హాకీ జట్టు ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్స్‌ దక్కించుకుందన్నారు. హాకీ క్రీడతో పాటు ఆర్మీ అధికారిగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించిందన్నారు. ప్రజల రోజువారీ జీవితంలో ఆటలను భాగం చేయాలనే ఉద్దేశంతోనే స్పోర్ట్స్‌ డే రోజున ప్రభుత్వాలు క్రీడలకు సంబంధించిన పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయన్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యమన్నారు. క్రీడాకారులను విద్యార్ధులు ఆదర్శంగా తీసుకుని చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుని దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని… అయితే అటు తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఆడుదాం ఆంధ్రా పేరుతో దోచుకుందన్నారు. అసలు ఆడుదాం ఆంధ్ర ఎందుకు పెట్టారో ఇప్పటికీ ఎవరికి అర్ధం కాని ప్రశ్నగానే మిగిలిందన్నారు. ఎన్నికల హామీగా తాము ఇచ్చిన హామీ రాజమండ్రిని స్పోర్ట్స్‌ హబ్‌గా మారుస్తాన్నారు. మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించి తీరుతామన్నారు.


TEJA NEWS