TEJA NEWS

భూభారతి చట్టంపై రెవెన్యూ అధికారులు అవగాహన కలిగి ఉండాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులను గుర్తించాలి

జిల్లాలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

వనపర్తి :
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి – 2025 చట్టంపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

       జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 'భూ భారతి' భూమి హక్కుల రికార్డు - 2025 చట్టంపై తహసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు, ఆర్ ఐ లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్టంలోని ముఖ్యంశాలను వివరించారు. 

       ఈ కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిఆర్డిఓ ఉమాదేవి హాజరయ్యారు. 

   కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు - 2025 చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. చట్టంలోని అన్ని నియమాలను చదివి తెలుసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే అవగాహన కార్యక్రమంలోనే అడిగి నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా తహసిల్దార్లు చట్టం లోని ప్రతి ఒక్క అంశం పైన అవగాహన సాధించాలన్నారు. 

    ప్రభుత్వం ఈ నూతన చట్టం ద్వారా అనేక భూ సమస్యలకు పరిష్కార మార్గం చూపించనుందని తెలిపారు. తహసిల్దారు చేసిన మ్యూటేషన్లు, జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డిఓకు లేదా కలెక్టర్కు అప్పిలు చేసుకునేలా రెండు అంచల అప్పీలు వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. అదేవిధంగా వారసత్వంగా సంక్రమించే భూముల మ్యూటేషన్ల విషయంలో నోటీసులు జారీ చేయాల్సిన ప్రక్రియపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.భూ భారతి చట్టం- 2025  ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భూకమతానికి యూనిక్ ఐడి భూదార్ ఇవ్వడం గురించి కూడా తెలియజేశారు. 

   ప్రభుత్వ భూముల గురించి మాట్లాడుతూ ప్రతి మండలంలో గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ నిర్వహించాలని, ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది అది ఏ పరిస్థితిలో ఉందనే వివరాలను క్రమ పద్ధతిలో ఉంచుకోవాలని సూచించారు. 

రైతులకు అవగాహన కార్యక్రమాలు
భూ భారతి చట్టం- 2025 పై రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఏప్రిల్, 17 నుండి మండలాల వారీగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం పై అవగాహన, అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. రైతులతో అవగాహన కార్యక్రమాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులను గుర్తించాలి
వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి పైలెట్ గ్రామాలు కాకుండా మండలాల వారీగా అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి నిజమైన అర్హులను గుర్తించే బాధ్యతను అప్పగించాలన్నారు. నిజంగా నిరుపేదలైన వారికే ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో చోటు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీ ఇలా సభ్యులకు తెలియజేయాలన్నారు. ఏప్రిల్ 21 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని, ఆ తర్వాత ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రత్యేక అధికారులను నియమించి ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాలను వెరిఫై చేసి వారు నిజంగా అర్హులైన కాదా తేల్చాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు జాబితాలో చోటు లేకుండా చూడాలన్నారు.

తాగునీటి ఇబ్బందులు రానివ్వద్దు
వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానికంగా ఉండే నీటి వనరులను సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. స్థానిక నీటి వనరులకు సంబంధించి ఏమైనా మరమ్మత్తులు చేసేది ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలలో వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

   ఈ సందర్భంగా తహసిల్దార్లకు, డిప్యూటీ తహసిల్దార్లకు, ఆర్ ఐ లకు భూభారతి చట్టంపై అవగాహన గురించి పరీక్షను నిర్వహించారు. 

   సమావేశంలో తహసిల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ ఐ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.