మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
- బిడ్డగా… సోదరుడిగా బాధ్యత తీసుకుంటా
- మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి
- రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం,
మహిళల రక్షణకు తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ( వాసు) హామీ ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు ఎమ్మెల్యే వాసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆప్యాయత అనురాగాలు, వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మహిళలు అర్థరాత్రి స్వేచ్చగా రోడ్డుమీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని మహాత్మా గాంధీ చెప్పారని, దురదృష్టవశాత్తు కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై హత్యాచారఘటన చాలా బాధకలిగించిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో వంటి కార్యక్రమాలు చేపడుతున్నా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల గౌరవం లేకుండా పలువురు మంత్రులు, నాయకులు ప్రవర్తించారని గుర్తు చేశారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల రక్షణకు కట్టుబడి ఉందన్నారు. మార్పు మన ఇంటి నుంచే మొదలుకావాలని కోరారు. ప్రతి మహిళలో తల్లిని.. చెల్లిని.. అక్కను చూడాలని కోరారు. దీని కోసం రాజమండ్రి నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇంట్లో మీ పిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పాలని తలిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తనవంతుగా మహిళల రక్షణకు తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. టీడీపీ పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు భద్రత రక్షణ, గౌరవం పెరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళలు ఎంతో ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాళ్లు కోసూరి చండీప్రియ, ద్వారా పార్వతి సుందరి, కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, అస్సరి, దొంగ నాగమణి, కర్ణం లక్ష్మీ నాయుడు, శ్రీలత, కోన సత్య, మోతా నాగమణి, లలిత, బూరా కల్పన, తుళ్లి పద్మ, మేరీ మాత, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.