
భూభారతి 2025 చట్టం రైతులకు భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి రైతుకు భరోసా భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని మంత్రి తెలిపారు.
భూభారతి చట్టం గురించి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు గాను ధరూర్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ధరణి వల్ల ఎంత ఇబ్బంది కలిగిందో రైతులకు తెలుసని దానిని దృష్టిలో ఉంచుకొని భూభారతి కొత్త చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నాలుగు పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి భూభారత చట్టం అవగాహన కల్పించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమని తెలిపారు. సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు. పేర్లు, సర్వే నంబర్లు, ఎకరాలు తప్పు పడిన గతంలో కార్యాలయాలు చుట్టూ తిరిగిన పనులు కాలేదని ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఒక రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. మే 1 నుండి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. ఈ చట్టంతో పాటు అవసరమైన సవరణలు చేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. ఆధార్ కార్డు లాగా భూదార్ కార్డులను ఇస్తామని మంత్రి తెలిపారు. 26 వేల సాదా బనామ దరఖాస్తులు పరిష్కరిస్తామని అన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ భూములకు గుర్తింపు తెచ్చి భద్రపరుస్తామని తెలిపారు. అధికారులు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉగాది నుండి సన్న బియ్యం ఇస్తున్నామని, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ అలాగే సన్నధాన్యానికి 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాదేనని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నెలకొల్పుతున్నట్లు, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి పేదలకు రైతులకు సేవలించాలని కోరారు.
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, రైతుల సమస్యలు తొలగించుటకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుని భూమి భద్రత కల్పించుకోవాలని అన్నారు. జిల్లాలో జూరాల ప్రాజెక్టు కింద ఆర్ఎన్ఆర్ పరిధిలో ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. ఓక అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని అన్నారు. గతంలో ధరణి వల్ల అనేక మంది రైతులు కష్టపడ్డారని కార్యాలయాల చుట్టూ తిరిగినా వారి పనులు కాలేదు అన్నారు. భూభారతి చట్టం వల్ల ప్రతి రైతుకు భద్రత కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేసిందని అన్నారు. మహిళల అభివృద్ధి కొరకు పెట్రోల్ బంకులు రైస్ మిల్లులు గోదాముల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని ఎంపీ తెలిపారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు 3500 ఇచ్చారని ఇంకా 1000 అదనంగా పెంచాలని కోరారు. పదవి శాశ్వతం కాదని అభివృద్ధి శాశ్వతమని ఎమ్మెల్యే తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతుకు మేలు జరుగుతుందని అన్నారు. గతంలో భూ సమస్య పరిష్కారానికి సివిల్ సమస్యలు ఉండేవని అలా కాకుండా నేరుగా తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ ద్వారా భూములను సమస్య పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఎకరాకు భూమికి భూదాన్ కార్డులు ఇస్తామని అన్నారు. సెక్షన్ 4 5 6 7 8 ద్వారా ఆర్వోఆర్ అప్లై చేసుకున్న వారికి పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరుగుతాయని అన్నారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు ఈ చట్టం ద్వారా చేయవచ్చని తెలిపారు. వారసత్వం సక్సేషన్ సెక్షన్ 8లో కోర్టు లోక్ అదాలత్ సమస్యల నుండి ఈ చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల హన్మంతు, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసిల్దార్ భూపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
