Spread the love

ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం నిర్వహించగా వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయ ఓటర్లు గురువారం ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల ముందు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు.
జిల్లాలో మొత్తం 2352 మంది ఓటర్లు ఉండగా 94.13 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. గురువారం ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం బుధవారం మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలతో పాటు ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందిని ప్రత్యేక బస్సుల ద్వారా జిల్లాలోని 13 మండలాల లోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నిక సాయంకాలం నాలుగు గంటలు సమయంలో ముగిసింది. ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని 13 పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న ఓటింగ్ సరళిని వీక్షించడం తో పాటు సెంట్రల్ డిసిపి షేక్ సలిమాతో కలసి వరంగల్ పట్టణంలోని ఇస్లానియా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ పక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్ లను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించాలని అధికారులను ఆదేశించగా, జిల్లాలోని 13 మండలాల నుండి ప్రత్యేక వాహనాల ద్వారా బ్యాలెట్ పత్రాలను భారీ బందోబస్తు మధ్య నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించారు.
జిల్లాలోని 13 మండలం లో 2352 ఓట్లకు గాను 2214 ఓట్లు 94.13 శాతంతో నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఓటును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు.