
బదిలీలకు సిద్ధమైన వేళ టీచర్ల సంఘాలు చర్చలను బహిష్కరించడం సరికాదు
టీచర్ల సమస్యలకంటే విద్యార్థుల భవిష్యత్, అభివృద్ధి కొరకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఒక్కో టీచర్ కు ఒక్కో సమస్య అనేలా డిమాండ్లతో ప్రాతినిధ్యాలు సబబు కాదు
అందరికీ వెబ్ కౌన్సెలింగ్ మాత్రమే అత్యుత్తమ మార్గం
తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకే వర్తించేలా డిమాండ్ పెట్టండి
రాష్ట్రంలో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీలకు ఎదురు చూస్తూ జీవోలు వచ్చే సమయంలో అధికారులతో టీచర్ల సంఘాలు చర్చలను బహిష్కరించాలానే నిర్ణయం సరికాదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపారని ఆ చర్చల సారాంశాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేయడం తప్ప ఉపాధ్యాయ సంఘాలు ద్వారా టీచర్లకు తెలియ చేస్తున్న పరిస్థితులు లేవన్నారు.
సంఘ నాయకుల హోదాలో పలుమార్లు చర్చలకు వెళ్ళటం,పోటీపడి అధికారులకు,ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందిస్తూ ఫోటోలు కోసం తాపత్రయపడటం తప్ప చర్చల్లో సాధిస్తున్నది ఏమీ కనబడడం లేదన్నారు. డిమాండ్ల పేరుతో పదులకొద్ది సమస్యలు ఏకరువు పెట్టేకన్నా క్షేత్రస్థాయిలో మెజార్టీ ఉపాధ్యాయులు,పాఠశాలలకు చెందిన సమస్యల పరిష్కారం కోసమే సంఘ నేతలు ప్రయత్నించాలన్నారు. నాయకుల వినతిపత్రాలు ద్వారా సమర్పించే డిమాండ్లలో ఒక్కో టీచర్ కి ఒక్కో కోరిక లా ఉంటున్నాయన్నారు. బదిలీలలో సంఘ నాయకులు,వారి కుటుంబ సభ్యులకి చెందిన వారికి జరిగే లాభ,నష్టాలు ఆధారంగా డిమాండ్లు పెట్టవద్దని,అధికారులతో పట్టు విడుపుల ధోరణితో బదిలీల ప్రక్రియ సజావుగా కొనసాగేలా చూడాలని ఉపాధ్యాయ సంఘాలను సురేష్ బాబు కోరారు.కౌన్సెలింగ్ కేంద్రాలలో రోజులకొద్దీ వేచిచూసే పని లేకుండా అందరికీ వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే అత్యుత్తమ మార్గమని అన్నారు.సంఘాలు కేవలం టీచర్ల సమస్యలే కాకుండా పేదపిల్లల భవిష్యత్తు,అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.తల్లికివందనం ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మాత్రమే వర్తించేలా సంఘాలు మొదటి డిమాండ్ గా పెట్టాలని కోరారు.
