TEJA NEWS

తెలంగాణ బలిదేవత తెలంగాణ తల్లి ఎట్లయింది?
ధర్మపురి
తెలంగాణా ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి ఉద్యమాన్ని అవమానించారు..

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్…
పెగడపల్లి :తెలంగాణ ఏర్పాటుకు ముందు సోనియా గాంధీని తెలంగాణ బలి దేవత అని సంబోధించిన ముఖ్యమంత్రి ఇప్పుడు సోనియాగాంధీని తెలంగాణ తల్లితో పోల్చడం ఆమె జన్మదినాన్ని డిసెంబర్ 9 నాడు తెలంగాణ అవతరణ ఉత్సవంగా ప్రతియేట జరుపుతామని ప్రకటించడం సిగ్గుచేటని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యమ్ విమర్శించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన సోనియా గాంధీ కాంగ్రెస్ ఎంపీల తిరుగుబాటుతో 2009 డిసెంబర్ 23 నాడు తెలంగాణ ఏర్పాటు రద్దు చేస్తున్నామని ప్రకటించడంతోనే తెలంగాణలోని విద్యార్థులు, యువకులు,ఉద్యోగులు 1500 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకొని వారి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చితే 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏనాడు స్పందించలేదని యూపీఏ కూటమికి అధ్యక్షురాలుగా ఉన్న సోనియాగాంధీ తెలంగాణా ఏర్పాటు గురించి ఎందుకు ప్రస్థావించలేదని అలాంటప్పుడు తెలంగాణ తల్లి ఎట్లవుతుందని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొని 1500 మంది ప్రాణాలను కోల్పోవడానికి కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీయే కారణం అన్నారు. అప్పటి పార్లమెంట్ లో బిజెపి ప్రతిపక్ష నేత స్వర్గీయ సుష్మా స్వరాజ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టండి బిజెపి పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందంటే బిల్లు పెట్టకుండ జాప్యం చేసిందికాంగ్రెస్ పార్టీ కాదా అని దుయ్యబట్టారు. అప్పటి రాజ్యసభలో బిజెపి ప్రతిపక్ష నేత ప్రకాష్ జగదేవకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెడితే బిల్లును తోసిపొచ్చి 1500 మంది చావుకు కారణం అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో సోనియా గాంధీ యూపీఏ కూటమికి అధ్యక్షురాలుగా మాత్రమే ఉన్నారు కానీ ప్రధానమంత్రి హోదాలో లేరు అనే విషయాన్ని గుర్తెరగాలి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు విషయంలో ఎడమ చేతిలో తెలంగాణాలోని అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మను తీసివేసి కుడి చేయి అభయం ఇస్తుంది అన్నట్లుగా ఉందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం అని అది అభయహస్తం లాగా లేదని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల నెత్తిన పెట్టిన భస్మాసుర హస్తములాగా ఉందని ఎద్దేవా చేశారు.తెలంగాణా తల్లి అంటే నాలుగు కోట్ల మంది భావోద్వేగం అన్న ముఖ్యమంత్రి తెలంగాణా ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణా ఉద్యమాన్ని అవమానపరచి ఆంధ్ర నాయకులకు వత్తాసు పలికిన నీచరిత్ర తెలంగాణా ప్రజలు మరచిపోలేదని అన్నారు.ఈసమావేశంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పల్లె మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు మంద భీమయ్య తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS