TEJA NEWS

ప‌త్తిరైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి
అడ్డగోలు నిబంధనలతో పత్తి రైతులు అవస్థలు
గ్రామీణ ర‌హ‌దారుల‌పై యూజ‌ర్ చార్జీలు విధింపు విర‌మించాలి
ఏపీ రైతు సంఘం జిల్లా అధ్య‌క్షుడు తాళ్లూరి బాబురావు
చిల‌క‌లూరిపేట‌:
న‌ష్ట‌పోయిన ప‌త్తిరైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని ఏపీ రైతు సంఘం ప‌ల్నాడు జిల్లా అధ్య‌క్షుడు తాళ్లూరి బాబురావు, చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షుడు చండ్ర కొండ‌ల‌రావు కోరారు. గురువారం ప‌ట్ట‌ణంలోని సీపీఐ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలతో ప‌త్తి దిగుబ‌డి గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని,దీంతో పాటు పత్తి ధర మరింత పతనమయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పత్తి పంట సాగుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు వస్తాయని, లాభాలు లేకపోయినా అప్పులు తీర్చుకోవచ్చని రైతులు భావించార‌ని వెల్ల‌డించారు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) నిబంధనల పేరుతో కాలయాపన చేస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు. పత్తిలో తేమ ఉందని పేచి పెడుతున్నారని, నిబంధనల సుడిగుండంలో రైతులు పత్తి అమ్ముకోడానికి అవస్థ పడుతున్నారని వెల్ల‌డించారు. గ‌త్యంతరం లేక ప‌త్తిరైతులు రోడ్లెక్కె ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ, సీసీఐ సమన్వయ లోపం పత్తి రైతులకు శాపంగా మారిందని ఆరోపించారు. ప్ర‌భుత్వం వెంట‌నే న‌ష్ట‌పోయిన ప‌త్తిరైతుల‌ను ఆదుకోవాటానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.


గ్రామీణ ర‌హ‌దారుల‌పై యూజ‌ర్ చార్జీలు విధింపు విర‌మించాలి
జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లపై యూజర్‌ చార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించ‌టం అమానుష‌మ‌ని, ఇది ప్రైవేటీక‌ర‌ణ‌కు దారి తీస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రహదారుల నిర్వహణను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించార‌ని,. ఈ ఏజెన్సీలు వాహనదారుల నుంచి నిర్దేశిత యూజర్‌ చార్జీలు వసూలు చేయ‌డం వ‌ల్ల‌ గ్రామీణ ప్ర‌జ‌ల‌పై పెనుభారానికి కార‌ణ‌మౌతుంద‌న్నారు. అస‌లే పంట‌లు పండ‌క రైతాంగం స‌త‌మ‌త‌మౌతున్న త‌రుణంలో రోడ్ల‌పై యూజ‌ర్ చార్జీలు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌టం స‌హేతుకం కాద‌న్నారు. ప్ర‌భుత్వ‌మే రోడ్ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టి, యూజ‌ర్ చార్జీల భారం లేకుండా చూడాల‌ని కోరారు. స‌మావేశంలో ఎస్టీయూ నాయ‌కులు వెంక‌ట‌య్య పాల్గొన్నారు.


TEJA NEWS