TEJA NEWS

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి.. లేదంటే ఆందోళన……… సిపిఐ

తేమ పేరుతో ధాన్యం కొనకపోవడంతో నష్టపోతున్న రైతులు

సాక్షిత వనపర్తి నవంబర్ 12
జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్త నడకన సాగుతున్నాయని వేగం పెంచాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జె.రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో సన్న దొడ్డు రకం కొనుగోలుకు 319 కేంద్రాలను తెరవాలని జిల్లా అధికారులు నిర్ణయించారన్నారు. నవంబర్ 11వ తేదీ వరకు 235 కొనుగోలు కేంద్రాలను తెరిచారని ఇంకా 84 కేంద్రాలు తెరవాల్సి ఉందన్నారు. 235 కేంద్రాలను తెరిచినప్పటికీ కేవలం ఎనిమిది కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించటం, నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఖాళీ సంచులు, టార్పలిండ్లు, పాడీ క్లీనర్లు, సన్నవడ్లు గుర్తించే మిషన్లు, కేంద్రాలకు రాలేదని రైతులు చెబుతున్నారన్నారు. గ్రామాల్లో ఆరబెట్టినందుకు రైతులకు కల్లాలు లేక రోడ్లపై ఆరబోస్తే కేసులు పెడుతున్నారని, కేంద్రాల్లో ఆరబెడదామంటే స్థలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తేమశాతం పేరుతో కేంద్రాల్లో ధాన్యం కొనకపోవటంతో రైతులు సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు రూ. 2320, ధర 500 బోనస్ ఇస్తామని చెప్పినప్పటికీ రూ.2100,2200 లకే మిల్లర్లకు అమ్ముకొని నష్టపోతున్నారన్నారు. ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయని పక్షంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను సమీకరించి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, గోపాలకృష్ణ, జయమ్మ, చిన్న కుర్మయ్య పాల్గొన్నారు.


TEJA NEWS