‘దిల్లీ చలో’..రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్
దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..
ఈ భారీ మార్చ్‌ను అన్నదాతలు మంగళవారం ప్రారంభించారు. ఈ ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో దిల్లీ కి బయల్దేరారు. అటు సంగ్రూర్ నుంచి మరో బృందం కూడా ఇంద్రప్రస్థ దిశగా కదిలింది..
ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. ”మేం బారికేడ్లను బద్దలుకొట్టాలనుకోవడం లేదు. చర్చలతోనే మా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. కానీ, వారు (కేంద్రం) మాకు ఏ విధంగా సాయం చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలుపెట్టాం. రోడ్లను బ్లాక్ చేస్తామని మేం చెప్పలేదు. ప్రభుత్వమే అలా చేస్తోంది. పంజాబ్, హరియాణా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దుల్లా కన్పిస్తున్నాయి” అని అన్నారు.