
విజయవాడలో ట్రాఫిక్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులను విస్తరించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. నూతన రోడ్ల నిర్మాణం, రహదారుల విస్తీర్ణానికి అవసరమైన నిధులను సీఆర్డీఏకు కేటాయించేందుకు సిద్ధమైంది.
విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 350 కోట్ల రూపాయల నిధులతో సీఆర్డీఏ త్వరలోనే నాలుగు రోడ్ల విస్తరణ పనులను చేపట్టనుంది. ఇప్పటికే నగర శివారులోని ఎనికేపాడు శక్తి కల్యాణ మండపం రోడ్డును 3.34 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. ఈ నెలాఖరులోగా ఈ రోడ్డు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరో నాలుగు రహదారులను సీఆర్డీఏ అభివృద్ధి చేయనుంది. మహానాడు రోడ్డును మరింత విస్తరించాలని నిర్ణయించారు. దీనిని నిడమానూరు వరకు పొడిగించి అక్కడ జాతీయ రహదారికి అనుసంధానించనున్నారు.
విజయవాడలో ఉండవింక ట్రాఫిక్ కష్టాలు (Sakshith News)
రూ.154 కోట్లు – 26 కిలోమీటర్లు – విశాఖలో 7 మాస్టర్ప్లాన్ రహదారులు
జాతీయ రహదారికి అనుసంధానం: ఇదే జరిగితే భారీ వాహనాలు రామవరప్పాడు మీదుగా కాకుండా మహానాడు రోడ్డు వైపు నుంచి నేరుగా నిడమానూరు వరకు వెళ్లనున్నాయి. బల్లెంవారి వీధి వద్ద కొన్ని చోట్ల 40, 50 అడుగులుగా రహదారి ఉంది. దీనిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించనున్నారు. అలాగే ఈ రోడ్డును ఎనికేపాడు వరకు పొడిగించి జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి నిర్ణయించారు. దీంతో నగరంలో ట్రాఫిక్ చాలా వరకు తగ్గనుంది. ప్రస్తుతం ఆయుష్ ఆస్పత్రి దగ్గర హైటెన్షన్ లైన్ల కింద అభివృద్ధి చేసిన రోడ్డును నిడమానూరు వరకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
హైటెన్షన్ తీగల కిందుగా ఈ రోడ్డును కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ఈ రోడ్డుకు భారీగా వ్యయం అవుతుందని సీఆర్డీఏ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎనికేపాడు – తాడిగడప రోడ్డును నేరుగా నిడమానూరుకు అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రోడ్డును నిడమానూరుకు అనుసంధానం చేయటం ద్వారా ఎన్హెచ్ 16కు కనెక్టివిటీని కల్పిస్తారు. నూతన రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
