TEJA NEWS

గిరిజన యూనివర్శిటీ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు

అమరావతి: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో గిరిజన యూనివర్సిటీ (Central Tribal University) నిర్మాణం జరుగుతోంది. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.వీ. కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్ మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు, తాజా పరిస్థితులపై వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

వర్సిటీ పనులు వేగవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు

గిరిజన వర్సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించింది. అందులో ఇదివరకే రూ.340 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. మొత్తం 561 ఎకరాల గిరిజన యూనివర్సిటీ ప్రాంగణంలో అడ్మిన్ బిల్డింగ్తో పాటు వసతి భవనాలు, అకడమిక్ బ్లాక్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు వేగవంతం చేయాలని వీసికి సీఎం చంద్రబాబు సూచించారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.

నిర్మాణాల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు వర్సిటీ వీసీకి చెప్పారు. యూనివర్సిటీకి తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, అప్రోచ్ రోడ్ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వేగంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. వర్సిటీకి 2 కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్ పనులు పూర్తి చేయాలని వీసి చెప్పగా… ఆ పనులు వెంటనే ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు.

100 మంది టీచింగ్ స్టాఫ్ అవసరం కాగా, ప్రస్తుతం కేవలం 18 మంది మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు. సిబ్బందిని మరింత పెంచాల్సిందిగా కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు సీఎం చంద్రబాబు. మే నెలలో నిర్వహించే యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ ప్రధాని మోదీకికి లేఖ రాస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

అద్దె భవనాల్లో క్లాసుల నిర్వహణ

2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అయింది. అప్పటి నుంచి అద్దె భవనాల్లో విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వర్సిటీ నిర్మాణ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఏదీ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వర్సిటీ నిర్మాణంపై మరోసారి దృష్టిసారించింది.

ప్రస్తుతం 600 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతుండగా.. సొంత భవనాలు పూర్తయితే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఉద్యోగం సాధించేలా, నైపుణ్యం పెంచేలా బోధన ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు గిరిజన యూనివర్సిటీ అధికారులను కోరారు. ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా, ఉద్యోగాల సాధన దిశగా కోర్సులను అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.