TEJA NEWS

భారత్ కు చేరుకున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ దంపతులు

హైదరాబాద్:
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల భారత్‌ పర్యటన కోసం సోమవారం ఉదయం పాలం ఎయిర్‌‌ బేస్‌కు చేరుకున్నారు.

అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. అమెరికా రెండవ మహిళా హోదాలో ఉషా వాన్స్ తొలిసారి స్వదేశానికి వచ్చారు. ఉషా వాన్స్ తెలుగమ్మాయి.

ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు. ఉషా చిలుకూరి తన ముగ్గురు పిల్లలతో భారత్‌కు వచ్చారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

సోమవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీకానున్నారు. ఈ సందర్భంగా సుంకాలపై ఇరువురు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా జేడీ వాన్స్‌ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఇవ్వను న్నారు. జేడీ వాన్స్‌ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన ఐదుగురు అధికారులు భారత్‌కు వస్తున్నారు.

ఇక సోమవారం సాయంత్రం 6.30 గంటలకు వాన్స్‌ దంపతులకు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోడీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు.

భేటీ అనంతరం ప్రధాని విందు ఇవ్వనున్నారు. వాన్స్‌ దంపతులతో పాటు అమెరికా అధికారులు హాజరు కానున్నారు.ఇక మంగళవారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు.

మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో వాన్స్‌ ప్రసంగించనున్నారు. 23వ తేదీ ఉదయం వాన్స్‌ దంపతులు, పిల్లలు ఆగ్రాకు వెళ్తారు. తాజ్‌ మహల్‌ తర్వాత జయపురకు వెళ్తారు.

24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు. ఇక జేడీ వాన్స్‌ రాక సందర్భంగా ఢిల్లీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.