TEJA NEWS

యడ్లపాడు రాజేశ్వరస్వామి ఆలయం 8వ వార్షిక మహోత్సవం

ఎడ్లపాడు గ్రామంలో భక్తుల నమ్మకానికి నిలయమైన శ్రీ గంగా పార్వతీ సమేత రాజేశ్వరస్వామి వారి దేవస్థానంలో 8వ వార్షికోత్సవ మహోత్సవం మే6వ తేదీన వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం వేకువ జామునుండే వార్షికోత్సవ వేడుకలు మొదలు అవుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. వేడుకల్లో భాగంగా స్వామి వారికి అభిషేకాలు, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, పలు రకాల ప్రసాద వినియోగం ఉంటాయన్నారు. సాయంత్రం 6 గంటలకు కండ్రిక, యడ్లపాడు, చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామాలకు చెందిన భజనమండలి నుండి 60 మంది హాజరై ఆలయ ప్రాంగణాణ కోలాట ప్రదర్శన ఇవ్వనున్నారు. 7 గంటలకు శివపార్వతుల శాంతి కల్యాణ వేడుకలు శాస్త్రోక్తంగా, పండితుల కోటప్పకొండకు పండితులు కొండకావూరి అప్పయ్యగురుకులు, ప్రసాద్‌శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు జంధ్యాల శ్రీరామచంద్ర మూర్తి ఆధ్వర్యాన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర శివ కల్యాణ దర్శనం అనంతరం, రాత్రి 8 గంటలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దైవ దర్శనంతో పుణ్యం సముపార్జించుకోవాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఈ మహోత్సవానికి విచ్చేసి స్వామి వారి కృపకు పాత్రులవ్వాలని కోరారు.