వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్ …పై తెలుగు మహిళ నాయకురాలు అసిలేటి నిర్మల…పోలీసులకు ఫిర్యాదు….సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ కాంప్లెయింట్..
వైసీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్ గుడివాడలో అరెస్ట్
ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై అసభ్య పోస్ట్‌లు
కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించగా.. న్యాయమూర్తి బెయిలు మంజూరు చేశారు
ఆగస్టు 17న టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఇంటూరి రవికిరణ్‌పై గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌లపై తీవ్ర అసభ్య పదజాలంతో అసభ్యకరంగా కార్టూన్లు సృష్టించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రవికిరణ్ వికృత ట్వీట్‌లు, పోస్టులు పెట్టినట్టు నిర్మల ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంటూరి రవికిరణ్ అసభ్యకరమైన ట్వీట్‌లు, పోస్టులతో నేతల ఫొటోలను అవమానకరంగా మార్ఫింగ్ చేశారని.. చర్యలు తీసుకోవాలని నిర్మల గుడివాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెక్షన్లు 193, 353(2), 336(4), 340(2) కింద కేసు నమోదు చేశారు. ఇంటూరి రవికిరణ్‌ను పలుమార్లు విచారణ నిమిత్తం పిలిచినా ఆయన స్పందించలేదు.. ఈ క్రమంలో రవికిరణ్‌ను ఆగస్టు 31న గుడివాడ వన్‌టౌన్ పోలీసులు విశాఖపట్నంలో అదుపులోకి తీసుకుని అదే రోజు ఆయనకు 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చి పంపించారు.
సెప్టెంబరు ఒకటి రోజు మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్‌లు రవికిరణ్‌ను పరామర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అయితే సోమవారం రవికిరణ్‌ను మరోసారి అరెస్టు చేసిన గుడివాడ పోలీసులు కోర్టుకు తరలించగా.. రూ.10 వేలు నగదు, ఇద్దరి పూచీకత్తులపై అతడికి న్యాయమూర్తి బెయిలు మంజూరు చేశారు.