ర్యాగింగ్ అనేది సరదా కాదు… పెద్ద నేరం
** జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి: తిరుపతిలోని
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆడిటోరియంలో యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను పూర్తిగా నిరోధించడంలో భాగంగా, ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఎస్వీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నరసింహారావు, రిజిస్ట్రార్ డాక్టర్ భూపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి లోకానికి మానవతా విలువలు పెంపొందించడమే అసలు విద్య అని పేర్కొన్నారు. ర్యాగింగ్ పేరు మీద తోటి విద్యార్థి మనోభావాలను దెబ్బతీయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. కొత్తగా యూనివర్సిటీలో అడుగు పెట్టిన విద్యార్థులను భయపెట్టకుండా, స్నేహపూర్వకంగా ప్రోత్సహించడం ప్రతి సీనియర్ బాధ్యత. ర్యాగింగ్ ద్వారా ఎవరికీ ఆనందం రాదు, కానీ అది ఎదుటివారికి మానసిక క్షోభను కలిగిస్తుంది. అలాంటి ఘటనలు చోటుచేసుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు, అని ఆయన హెచ్చరించారు.
విద్యాలయానికి మనం ఎందుకు వచ్చాము, అనే విషయం ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలి.
ర్యాగింగ్ ఘటనలు ఎదురైనప్పుడు పోలీసులు ఎప్పుడూ విద్యార్థుల పక్కనే ఉంటారని, ఫిర్యాదు చేసిన వారికి పూర్తి రక్షణ, న్యాయం అందించబడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే, ఈ యాంటీ-ర్యాగింగ్ ప్రతిజ్ఞ కేవలం అక్షరం కాదు అది మన హృదయంలో ముద్రించుకోవలసిన నిబద్ధత. ఎవరినీ అవమానపరచకండి, ఎవరినీ భయపెట్టకండి, ఎవరినీ చెడు దారిలో నడిపించకండి. విద్యార్థుల్లో మానవత్వం మొదలైతే హింస తానే అంతమవుతుంది అని ఎస్పీ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ, ర్యాగింగ్ అనేది విద్యార్థి జీవితాన్ని దెబ్బతీసే ప్రమాదకర అలవాటు. మన యూనివర్సిటీలో ప్రతీ ఒక్క విద్యార్థి సురక్షిత వాతావరణంలో చదువుకునే బాధ్యత అందరికీ ఉంది. విద్య అనేది క్రమశిక్షణ, మానవత్వం, పరస్పర గౌరవం నేర్పే స్థలం కావాలి, అని అన్నారు.
విద్యార్థుల్లో యాంటీ – ర్యాగింగ్ అవగాహన పెంపొందించడానికి పోలీస్ శాఖ, యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి డిఎస్పి భక్తవత్సలం, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
