బాచుపల్లి స్మశాన వాటిక తొలగింపు అంశంపై మంత్రి శ్రీధర్ బాబు కి వినతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న స్మశాన వాటికను తొలగించాలనే ప్రతిపాదనపై స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ఏర్పడిన కొత్త కాలనీ నివాసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, స్మశాన వాటికను తొలగిస్తే సుమారు 50 వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్థులు తెలిపారు. అదేవిధంగా ఎంపీపీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ కాలంలో ఈ స్మశాన వాటిక అభివృద్ధి కోసం నిధులు కూడా కేటాయించారు..
ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని కలిసి సమస్యపై వినతి పత్రం సమర్పించారు. స్మశాన వాటిక అనేక సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడుతోందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దానిని కొనసాగించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు సంబంధిత అధికారులతో సమగ్రంగా పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
