వనపర్తి : ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలలను జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లను సంబంధిత శాఖాధికారులు తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. జిల్లా అధికారులు తమకు కేటాయించిన ప్రభుత్వ పాఠశాలలు, వెల్ఫేర్ హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని, హాస్టళ్లలో ఉన్న వాతావరణాన్ని పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, వారితో కలిసి మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం చేయాలని సూచించారు.
హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుధ్యం సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించాలని, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉందో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. భోజనం విద్యార్థులకు వడ్డించే ముందు సూపర్వైజర్ తప్పనిసరిగా రుచి చూసి నిర్ధారించాలనే నిబంధన అమలవుతోందో లేదో చూడాలని తెలిపారు.
అధికారులు సందర్శనలో గుర్తించిన సమస్యలు, అవసరాలను ప్రభుత్వం అందించిన గూగుల్ ఫారమ్‌లో నమోదు చేసి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్శన కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశం లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
