అరైవ్–అలైవ్” లక్ష్యంతో పోలీసులకు కంటి పరీక్షలు
కంటి చూపు లోపాలతో రోడ్డు ప్రమాదాల కు అవకాశం……. పట్టణ ఎస్సైహరి ప్రసాద్
హరిప్రసాద్
వనపర్తి
రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న “అరైవ్ అలైవ్–2026” రెండవ దశ కార్యక్రమంలో భాగంగా పట్టణ ఎస్సై హరిప్రసాద్ మరియు ట్రాఫిక్ ఎస్సై సురేందర్ ఆధ్వర్యంలో పట్టణ పోలీసు సిబ్బందికి, ట్రాఫిక్ పోలీసులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించారు.
వైద్య బృందం పోలీసు సిబ్బందికి క్షుణ్ణంగా కంటి పరీక్షలు నిర్వహించి, చూపులో ఉన్న లోపాలను గుర్తించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. కంటి చూపులో లోపాలు ఉన్న సిబ్బందికి తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
ఈ సందర్భంగా టౌన్ ఎస్సై హరిప్రసాద్ మాట్లాడుతూ.. సురక్షిత ప్రయాణానికి స్పష్టమైన కంటి చూపు అత్యంత ముఖ్యమని తెలిపారు. దూరదృష్టి లోపం, చూపు మందగించడం వంటి సమస్యలు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉన్నందున పోలీసు సిబ్బంది విధుల్లో వాహనాలు నడిపేటప్పుడు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచించారు.
అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనాలను పరిమిత వేగంతో నడపడంతో పాటు డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఏకాగ్రత కోల్పోయి తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున పోలీసు సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై సురేందర్, ఏఎస్సైలు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, పోలీసు సిబ్బంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
