ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపుదాం..
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలి
- సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా జనజాగృతికి శ్రీకారం
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
సౌరశక్తి వినియోగంపై ప్రజలను ప్రోత్సహిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపుదామని.. పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈఎఫ్ఐ) – సూర్యాంధ్ర ప్రగతి రథ శకటాలను కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి లభించడంతో పాటు పర్యావరణ హిత జీవితానికి ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేయూతతో అమల్లో ఉన్న పీఎం సూర్యఘర్ – ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ద్వారా 60 శాతం వరకు రాయితీతో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని విద్యుత్ వినియోగదారులు ఉత్పత్తిదారులుగా మారొచ్చన్నారు. ఇంటి అవసరాలకు ఉపయోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని పేర్కొన్నారు.
విద్యుత్ స్వయం సమృద్దితో విద్యుత్ కొనుగోలుపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి యజమానులు, అపార్టుమెంట్లు, హౌసింగ్ సొసైటీలు, చిన్న, మధ్యతరహా వ్యాపారస్తులు, రైతులు పథకానికి అర్హులని వివరించారు. పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఎన్ఎస్ఈఎఫ్ఐ – సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ రథం ద్వారా పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ వివరాలు ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని, ఎన్ఎస్ఈఎఫ్ఐ సీఈవో సుబ్రహ్మణ్యం పులిపాక మార్గనిర్దేశనంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి సీహెచ్ ఉదయ్ తెలిపారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
