
మేడే పోరాట స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దు కోసం ఐక్య పోరాటం అవసరం….
పెద్దపల్లి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐఎఫ్టీయూ…
పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం -ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టిపిసి సోలార్ ప్లాంట్ వద్ద సోమవారం “140వ మేడే” పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పీసీకేఎస్ ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ మాట్లాడుతూ, 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమం చారిత్రాత్మకమని తెలిపారు.
ఆందోళనలపై పెట్టుబడిదారీ వర్గం కాల్పులు జరపగా ఆరుగురు కార్మికులు మరణించారని, అనేక మంది నాయకులను అరెస్టు చేసి ఉరితీసిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.
కార్మికుల బలిదానాలతో మేడే చరిత్ర నిర్మితమైందని, అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం మేడేను ఘనంగా జరుపుకుంటూ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తోందన్నారు. భారతదేశంలో కార్మికులు 8 గంటల పని దినం, కనీస వేతనాలు, హక్కులు, సంక్షేమం కోసం నిరంతర పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను బలహీనపరచేలా నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, 12 గంటల పని విధానం అమలు దిశగా చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మేడే పోరాట స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఆర్.రాయమల్లు, ఎండి సాదిక్, ఎం. రమేష్, జే.కుమార్ స్వామి, జి. తిరుపతి, సిహెచ్.శ్రీనివాస్, జే. సాయికుమార్, కే.సురేష్, పల్లె రమేష్, జి. వెంకటేష్ తదితరులతో పాటు సుమారు 50 మంది కార్మికులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
