బాపట్ల జిల్లా సముద్ర తీర ప్రాంతాలకు విచ్చేసే యాత్రికులకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ కీలక సూచనలు

Spread the love

బాపట్ల జిల్లా సముద్ర తీర ప్రాంతాలకు విచ్చేసే యాత్రికులకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ కీలక సూచనలు

పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలి

సూచించిన లోతు దాటి లోపలికి వెళ్లరాదు

సముద్ర తీరంలో మద్యం సేవించరాదు, మద్యం సేవించి సముద్రంలోకి దిగరాదు

పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు ఉండాలి

ఇతరులను ఇబ్బందులకు గురి చేసినా, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తప్పవు
బాపట్ల :వేసవి సెలవుల నేపథ్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని సూర్యలంక, చీరాల వాడరేవు, రామాపురం బీచ్ తదితర సముద్ర తీర ప్రాంతాలకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ పలు కీలక సూచనలు చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా సముద్రంలో లోతుగా వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను గమనించి నడుచుకోవాలని సూచించారు. పిల్లలను ఎప్పుడూ పెద్దల పర్యవేక్షణలో ఉంచాలని, ఒంటరిగా సముద్రంలోకి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.

వృద్ధులు, చిన్నారులు బీచ్ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని, వృద్ధులు ఎక్కువసేపు ఎండలో తిరగకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చిన్నారులు సముద్ర తీరానికి దగ్గరగా వెళ్లకుండా ఎప్పుడూ తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే ఉండాలని స్పష్టం చేశారు. అలల ప్రభావం ఒక్కసారిగా మారే అవకాశం ఉన్నందున చిన్నారులను ఒంటరిగా వదిలేయకూడదని హెచ్చరించారు.

మద్యం సేవించి సముద్రంలో దిగడం ప్రమాదకరమని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా, మద్యం సేవించి సముద్రంలో దిగినా, ఇతరులకు ఇబ్బంది కలిగించినా లేదా అసభ్యంగా ప్రవర్తించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. యాత్రికుల భద్రత దృష్ట్యా సముద్ర తీర ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ పందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్రోన్‌లతో సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నామన్నారు. ప్రజలు సహకరిస్తేనే ప్రమాదాలను నివారించగలమని, జాగ్రత్తగా ఉండి ఆహ్లాదకరంగా సముద్ర తీర ప్రాంతాల్లో గడిపి సంతోషంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు లేదా పోలీస్ శాఖ సహాయం అవసరమైనప్పుడు దగ్గర్లో ఉన్న పోలీసులకు లేదా 112 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top