
పాటల పేరుతో మహిళా కార్మికురాలిపై దాడులు దారుణం….
అసభ్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి…..
–పి ఓ డబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే జ్యోతి…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పదజాలంతో పాటలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం (పి ఓ డబ్ల్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే జ్యోతి తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచే విధంగా జరుగుతున్న ఈ తరహా దాడులు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదకర చర్యలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, సింగరేణి వ్యాప్తంగా వేలాది మంది మహిళా కార్మికురాళ్లు వివిధ విభాగాల్లో కష్టపడి పనిచేస్తున్నారని, ఇప్పటికే పని ప్రదేశాల్లో వివక్ష, వేధింపులు, అవమానాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా మహిళా కార్మికురాలిపై అసభ్యకర పాటలు రూపొందించి ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు.
ఏవైనా వ్యక్తిగత లేదా ఉద్యోగ సంబంధిత సమస్యలు ఉంటే చట్టపరమైన మార్గాల్లో, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కానీ మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పాటలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనాగరిక చర్య అని మండిపడ్డారు. ఇటువంటి ప్రచారాలు మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వారి కుటుంబ సభ్యులను కూడా మానసికంగా వేధింపులకు గురిచేస్తాయని పేర్కొన్నారు.
సమాజంలో మహిళలపై జరుగుతున్న మానసిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం, యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని జ్యోతి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళలను అవమానించే వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే పని ప్రదేశాల్లో మహిళా కార్మికులకు భద్రత, గౌరవం కల్పించే చర్యలను సింగరేణి యాజమాన్యం బలోపేతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
