
సింగరేణి గనుల్లో మహిళా శక్తి గర్జన…
13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్లు నడపనున్న మహిళలు….
సింగరేణిలో విప్లవాత్మక నిర్ణయం.. మహిళా ఆపరేటర్లకు గ్రీన్ సిగ్నల్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:సింగరేణి భవన్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సంస్థలో మహిళా సాధికారతకు మరో కీలక అడుగు పడింది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ డంపర్లను నడిపే బాధ్యతలను మహిళలకు అప్పగించేందుకు సింగరేణి యాజమాన్యం సన్నాహాలు ప్రారంభించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు మహిళా శక్తికి ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం సూచించడంతో సింగరేణి సంస్థ మహిళా డంపర్ ఆపరేటర్ల నియామక ప్రక్రియను చేపట్టింది.
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో గత 50 ఏళ్లుగా 60 నుంచి 100 టన్నుల సామర్థ్యమున్న భారీ డంపర్లను కేవలం పురుష ఉద్యోగులే నిర్వహిస్తూ వచ్చారు. తీవ్రమైన ఎండలు, భారీ వర్షాలు, చలిలో మూడు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉండటంతో ఈ విధులు అత్యంత క్లిష్టంగా భావించబడుతున్నాయి. అయినప్పటికీ మహిళలు కూడా ఇటువంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరనే నమ్మకంతో యాజమాన్యం ముందడుగు వేసింది.
ఈ నేపథ్యంలో ఆసక్తి గల మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా సుమారు 35 మంది ముందుకు వచ్చారు. భారీ వాహనాల లైసెన్స్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సిరిసిల్లలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టైడ్స్) ద్వారా మహిళలకు ఉచిత శిక్షణ అందించారు.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 13 మంది మహిళా ఉద్యోగులు డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీకి తెలిపారు. త్వరలో విడుదలయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో వీరికి అవకాశం కల్పించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ, మొదట భారీ డంపర్లు నడపడం పట్ల భయం ఉన్నప్పటికీ శిక్షణ అనంతరం తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, గనుల్లో కూడా మహిళలు సమర్థంగా పనిచేయగలరని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
అధికారులు మాట్లాడుతూ, సింగరేణిలో ఇప్పటికే బెల్లంపల్లి ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనిలో మహిళలతో ప్రత్యేక బ్లాస్టింగ్ విభాగాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, సంస్థ చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇకపై కూడా క్లిష్టతరమైన విభాగాల్లో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
