ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ… కార్మికులకు న్యాయమైన కనీస వేతనాలు కావాలి

Spread the love

ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ… కార్మికులకు న్యాయమైన కనీస వేతనాలు కావాలి

పెరిగిన ధరలకు తగ్గట్టు కనీస వేతనాలు పెంచాలి – ఏఐటీయూసీ నాంసాని శంకర్ డిమాండ్…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లోపించిందని, ప్రస్తుత ధరల పెరుగుదల మరియు జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు న్యాయమైన కనీస వేతనాలు నిర్ణయించాలని రామగుండం ఏరియా కాంట్రాక్ట్, క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అధ్యక్షుడు నాంసాని శంకర్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల సవరణను స్వాగతిస్తున్నప్పటికీ, సుమారు 14 సంవత్సరాల తరువాత జరిగిన ఈ సవరణ కార్మికుల ఆశలకు పూర్తిగా అనుగుణంగా లేదని ఆయన పేర్కొన్నారు. కార్మిక సంఘాలు, కార్మికులు చేసిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ధరల సూచీ, ద్రవ్యోల్బణం, కుటుంబ పోషణ వ్యయాల ఆధారంగా వేతనాలు నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.16,000, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.17,000, స్కిల్డ్ కార్మికులకు రూ.18,500, హైస్కిల్డ్ కార్మికులకు రూ.20,000 వేతనాలు ప్రకటించినప్పటికీ, కరువు భత్యం (డి ఏ ) అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే చాలా మంది కార్మికులు పొందుతున్న వేతనాలతో పోలిస్తే ఈ పెంపు తగినంత ఉపశమనం కలిగించే స్థాయిలో లేదని అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక కుటుంబాల జీవనం భారంగా మారిందని, కేంద్ర కార్మిక సదస్సుల సిఫార్సులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా కనీస వేతనాలను పునర్నిర్ణయించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.

కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పునాది అని, ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి కనీస వేతనాలపై పునఃసమీక్ష చేపట్టి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని నాంసాని శంకర్ కోరారు.

You cannot copy content of this page

Scroll to Top