
సమానత్వ సమాజ నిర్మాణానికి భాగ్యరెడ్డి వర్మ ఆశయాలే మార్గదర్శకం…
రామగుండం నగరపాలక సంస్థలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు….
–మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,సంఘ సంస్కర్త, దళితోద్యమ పితామహుడు భాగ్యరెడ్డి వర్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దళితుల విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ బాలికల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ 26 తెలుగు మాధ్యమ పాఠశాలలను స్థాపించారని గుర్తుచేశారు. సమాజంలో నెలకొన్న అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం సాగించడమే కాకుండా జోగిని, దేవదాసి వ్యవస్థల నిర్మూలన కోసం ఉద్యమించారని తెలిపారు. బాల్య వివాహాలు, మద్యపానానికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించి సామాజిక చైతన్యాన్ని పెంపొందించారని కొనియాడారు.
దళితులు ‘ఆది హిందువులు’ అని ప్రకటించి వారిలో ఆత్మగౌరవాన్ని నింపిన మహనీయుడిగా భాగ్యరెడ్డి వర్మ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన నిరంతర కృషి ఫలితంగానే 1931 జనాభా లెక్కల్లో నిజాం ప్రభుత్వం దళితులను ‘ఆది హిందువులు’గా నమోదు చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్.ఈ. గురువీర, కార్పొరేటర్లు కొలని కవిత, ధూళికట్ట సతీష్, షేక్ బాబూమియా, చిదురాల నాగరాజు, నాయకులు బొంతల రాజేష్, మారెల్లి రాజిరెడ్డి, ఆసిఫ్ పాషా, కాంపెల్లి సతీష్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, నగరపాలక సంస్థ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
