బక్రీద్ పండుగను శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపుకోవాలి….

Spread the love

బక్రీద్ పండుగను శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపుకోవాలి….

ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి….

— మేయర్ మహంకాళి స్వామి….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
బక్రీద్ పండుగను మత సామరస్యంతో, శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలోని ఈద్గాల వద్ద నమాజ్ నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.12 లక్షలు వ్యయం చేసి టెంట్లు, తాగునీరు, ధ్వనివ్యవస్థలు తదితర ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

పశువుల వధ విషయంలో చివరి క్షణం వరకు వేచి చూడకుండా ముందుగానే పశువైద్యాధికారుల నుంచి అనుమతులు పొందాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే సందేశాలు, వదంతులు, అపోహలు వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నగరపాలక సంస్థను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పండుగ ఏర్పాట్లకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అదనపు అవసరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ, నగరంలోని ఏడు ఈద్గాల వద్ద ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పశువుల వధకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పశువుల ఆరోగ్య ధ్రువీకరణ పత్రాల జారీ కోసం అదనపు పశువైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వధకు అనర్హమైన పశువులను తరలించేందుకు గోశాల సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

సహాయ పోలీస్ కమిషనర్ ముడుత రమేష్ మాట్లాడుతూ, చట్టాలను గౌరవిస్తూ ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. జంతువుల రవాణా తదితర అంశాల్లో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

పశువైద్యాధికారి ప్రసాద్ మాట్లాడుతూ పశువుల వధకు ముందుగా అనుమతులు తప్పనిసరిగా పొందాలని కోరారు. దరఖాస్తు వివరాలు మరియు ఇతర సమాచారం కోసం తమ కార్యాలయాన్ని లేదా అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజేశ్వర్‌రావు, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర్, పలువురు కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, ఎన్‌టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top