
రోగులకు మెరుగైన వైద్యం.. రైతులకు ఇబ్బందులు లేకుండా సేవలు …..
ఆసుపత్రులు, కళాశాలలు, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం,
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, గౌతమి నగర్లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్లులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని రక్త పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, సమయం ముగిసిందనే కారణంతో ఏ రోగినీ వెనక్కి పంపవద్దని, అందరి శాంపిల్స్ సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు వెంటనే అందించాలని సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గైనిక్ ఓపీ విభాగాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం శారద నగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఇంటర్మీడియట్ ఫలితాలు, స్టడీ రూమ్ సౌకర్యాలు, అడ్మిషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు అవసరమైన పరికరాల ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
తర్వాత గౌతమి నగర్లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్లులను పరిశీలించిన కలెక్టర్, రైతుల ధాన్యంపై ఎలాంటి కటింగ్ విధించవద్దని స్పష్టం చేశారు. లారీలను ఎప్పటికప్పుడు దించుకోవాలని, రైతులు ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితులు రాకుండా చూడాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ పర్యటనలో డాక్టర్లు అరుణ, కృపాభాయి, రాజు, సంబంధిత అధికారులు తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
