
ఎంఎస్పీ పెంపు పేరుతో రైతులను మోసం చేస్తున్నారు….
—ఏఐకేఎంఎస్ నాయకుల ఆగ్రహం….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: అంతర్గాం,
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) జీవో పత్రాలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ, విద్యుత్, ఉపాధి హామీ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
వరి ధాన్యానికి కేవలం రూ.72 మాత్రమే పెంచడం రైతులను అవమానపరచడమేనని వారు మండిపడ్డారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతు శ్రమను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
“రైతే రాజు” అని చెప్పుకునే ప్రభుత్వాలు రైతుల వెన్నెముకనే విరగ్గొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు ఐ రాజేష్, గుండేటి మల్లేశం, ఆలకుంట దేవయ్య, ఎల్ శంకర్, టి రాజకొమురయ్య, రెబ్బ రాయలింగు, పానుగంటి మల్లయ్య, ఉమామహేశ్వరరావు, ఇండిపెళ్లి ఏసు, కన్లే మురళి, మాడ స్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
