పెద్దపల్లి కల సాకారం దిశగా అడుగులు….

TEJA NEWS

పెద్దపల్లి కల సాకారం దిశగా అడుగులు….

బస్ డిపో పనులు వేగవంతం చేసి త్వరలో ప్రారంభిస్తాం….

— రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత ఆర్టీసీ బస్ డిపో నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబులను ప్రభుత్వ విప్ విజయరమణ రావు ఘనంగా స్వాగతించి సన్మానించారు.

అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ విజయరమణ రావు, మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. పెద్దపల్లి ప్రజల చిరకాల వాంఛ అయిన బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఆర్టీసీ బస్సుల డిమాండ్ గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు గుర్తుచేశారు.

ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలను త్వరలో నిర్వహించి, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దని సూచించారు.

పెద్దపల్లి బస్ డిపో మంజూరులో ప్రభుత్వ విప్ విజయరమణ రావు పట్టుదలతో కృషి చేశారని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top