
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దంపేట గ్రామ ప్రజలకు షీ టీమ్ అవగాహన సదస్సు…
మహిళల భద్రత, రక్షణ, సమస్యల పరిష్కారానికి షీ టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)లో భాగంగా సోమవారం హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ సభలో నిర్వహించిన ప్రజా అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో షీ టీమ్ సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ, వివాహిత మహిళలు సమాజంలో, కార్యాలయాల్లో, సామాజిక మాధ్యమాల్లో మరియు ఇతర వ్యక్తుల ద్వారా ఎదుర్కొనే వేధింపులు ప్రస్తుతం ఒక ప్రధాన సమస్యగా ఉన్నాయని తెలిపారు. అనేక సందర్భాల్లో కుటుంబ గౌరవం, భయం లేదా ఇతర కారణాల వల్ల మహిళలు తమకు ఎదురైన వేధింపులను బయటపెట్టలేకపోతున్నారని పేర్కొన్నారు.
అయితే, ఇలాంటి వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు శాఖ, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు,షీ టీమ్స్ వంటి ప్రత్యేక విభాగాలు మహిళల భద్రత, రక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రయాణాల సమయంలో, బస్స్టాప్లు,రైల్వే స్టేషన్లు,కాలనీలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించడం, వెంబడించడం, అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్య సైగలు చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి బెదిరింపులకు పాల్పడడం వంటి వేధింపులకు గురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.ఇలాంటి సంఘటనలపై రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385 లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి కొమురయ్య, పంచాయతీ కార్యదర్శి రూపాదేవి, మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
