
ఇస్రోలో మెరిసిన ఖని విద్యార్థి ప్రతిభ….
భగవద్గీత పోటీలో సత్తా చాటిన రిశ్విక్‌కు జాతీయ స్థాయి గౌరవం….
ఇస్రో సందర్శనకు ఖని విద్యార్థి రిశ్విక్
— ఇస్రో చైర్మన్‌ను కలిసే అరుదైన అవకాశం…
గోదావరిఖని బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను సందర్శించడానికి, నేషనల్ టాపర్స్ అవార్డ్ సెరెమనీలో పాల్గొనడానికి స్థానిక కృష్ణవేణి స్కూల్ విద్యార్థి రాకం రిశ్విక్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది.
అంతర్జాతీయ సంస్థ ఇస్కాన్ గత ఫిబ్రవరి 3న. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ప్రపంచ స్థాయి “భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్”లో రాకం రిశ్విక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 95 శాతం కంటే అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి జిల్లా స్థాయి ప్రతిభావంతులను ఎంపిక చేశారు.
గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన రాకం కిరణ్–శ్వేత దంపతుల కుమారుడు రాకం రిశ్విక్ ప్రస్తుతం కృష్ణవేణి స్కూల్స్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. తన ప్రతిభతో జిల్లా స్థాయి సెకండ్ టాపర్‌గా నిలిచి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ప్రేమ్‌రాజ్ చైతన్య రిశ్విక్‌కు బహుమతిగా సైకిల్‌తో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ నెల 12న బెంగళూరులో నిర్వహించే నేషనల్ టాపర్స్ అవార్డ్ సెరెమనీలో పాల్గొనడంతో పాటు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను సందర్శించే అవకాశాన్ని కల్పించారు.
అదేవిధంగా ఇస్రో చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్. సోమనాథ్‌ను కలిసే అవకాశం కూడా రిశ్విక్‌కు లభించింది. ఆయనతో గ్రూప్ ఫోటో దిగడం, డమ్మీ రాకెట్ లాంచింగ్ డెమోను వీక్షించడం వంటి విశేష అవకాశాల కోసం తల్లిదండ్రులతో కలిసి రిశ్విక్ బెంగళూరుకు బయలుదేరి వెళ్లాడు.
తమ పాఠశాల విద్యార్థి రిశ్విక్ ఇస్రో సందర్శనకు ఎంపిక కావడంపై కృష్ణవేణి స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ మంజులా శ్రీనివాస్ రెడ్డి, క్యాంపస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని అభినందించారు.