
మంథనిలో దుద్దిళ్ల రాజ్యాంగం నడుస్తోంది…
పూదరి సత్యం అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర విమర్శలు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ అధికారంలో ఉన్న ప్రతిసారి సమాజాన్ని అణిచివేస్తూ, మాట్లాడే వారిని జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్‌ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రామగుండం సీపీ కార్యాలయానికి చేరుకుని ఆయన మీడియాతో మాట్లాడారు.
పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న మంథనిని అల్లకల్లోలం చేస్తున్నారని, ప్రతి రోజు ఏదో ఒక విధ్వంసంతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో బండి రాజు ఆత్మహత్య కేసులో పూదరి సత్యనారాయణగౌడ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇప్పటికే ఒకసారి కోర్టు అరెస్ట్ చెల్లదని చెప్పిందని, ఈసారి కూడా జడ్జి తిరస్కరించారని పేర్కొన్నారు.
మంథనిలో ప్రస్తుతం అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా “దుద్దిళ్ల రాజ్యాంగం, పోలీసుల రాజ్యం” నడుస్తోందని విమర్శించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నాయకులు మంథనికి వచ్చి పరిస్థితులు చూడాలని డిమాండ్ చేశారు. గతంలో తనపై రౌడీషీట్ పెట్టించారని, అయినా తాము ఓర్పుతో వ్యవహరించామని, కానీ ఇప్పుడు తమ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.
పూదరి సత్యనారాయణను రాత్రి వేళ అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, కాంగ్రెస్ నాయకుడిని కాపాడేందుకే ఈ చర్యలు చేపట్టారని మధూకర్ ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన వ్యక్తిని వదిలిపెట్టి పూదరిని అరెస్ట్ చేయడం దౌర్భాగ్యమని అన్నారు.
ఇప్పటికే జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చామని, అవసరమైతే భారీ స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పోలీస్ అధికారులు రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులకు శంకరిగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. రామగుండం సీపీ పరిధిలోని పోలీసులు కాంగ్రెస్ నాయకుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారే పరిస్థితి తీసుకురావద్దని, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా సీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.