
మంగళగిరిలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు”
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఆధ్వర్యంలో మంగళవారం “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో టౌన్ హాల్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని చిల్లపల్లి కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదనమోహన్, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావుతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ,నియోజకవర్గ స్థాయి వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నేతలు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజలకు “వెన్నుపోటు”గా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘చంద్రబాబు రెండు సంవత్సరాల వెన్నుపోటు’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమే వెన్నుపోటుతో ప్రారంభమైంది. ఇప్పటికీ ప్రజలను వెన్నుపోటు పొడిచే స్థితికి వచ్చారు.ఇచ్చిన వాగ్దానాలు ఏనాడూ నెరవేర్చలేదు. సంక్షేమ ఫలాలు అందక పేదలు, మహిళలు, యువత, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పిల్లలను చదివించుకోవడం కష్టంగా మారింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. రైతులకు సబ్సిడీలు, సహాయం అందడం లేదు.మహిళలను ఏ విధంగా మోసం చేశాడో, వెన్నుపోటు పొడిచాడో రాష్ట్రంలోని ప్రతి మహిళకు తెలుసు.ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసేందుకు 12వ తారీఖున పార్టీ పిలుపు మేరకు నిరసన దినంగా పాటిస్తున్నామని వేమారెడ్డి ప్రకటించారు. ఆ రోజున మంగళగిరి నియోజకవర్గంలో మరో కార్యక్రమం చేపడతామని తెలిపారు.చివరగా సమావేశానికి హాజరైన కార్యకర్తలు, నాయకులు, సోదరీమణులందరికీ వేమారెడ్డి హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.
సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు – ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో భారీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలిపారు.చంద్రబాబు పాలనను ‘వెన్నుపోటు పరిపాలన’గా అభివర్ణించిన హనుమంతరావు, ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, పొరపాట్లను కార్యకర్తలకు వివరించామని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని, పాలన జరుగుతున్నా ప్రజల బతుకులు మారలేదని ఆయన విమర్శించారు.
‘సూపర్ సిక్స్’ హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ, ఒక పెన్షన్ తప్ప మిగతా ఏ హామీనీ అమలు చేయడం లేదని ఆరోపించారు. రెండేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ ఈ నిర్ణయం తీసుకుందని, ఇటీవల మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించామని, నేడు నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.రేపు, 12వ తేదీన కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హనుమంతరావు ప్రకటించారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం పూర్తిగా అప్పులపాలవుతోందని, పేద, మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగ భద్రత కరువైందని, కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలకు ఆశ చూపించి మోసం చేశారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు స్పష్టం చేశారు.
మంగళగిరిలో ఘనంగా ‘వెన్నుపోటుకి రెండేళ్లు’ కార్యక్రమం: మదన్ మోహన్ రావు
చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి ‘వెన్నుపోటుకి రెండేళ్లు’ కార్యక్రమాన్ని మంగళగిరి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్ రావు మాట్లాడారు.
గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కార్యకర్తలు పెద్దఎత్తున కదం తొక్కారని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో కార్యక్రమానికి వచ్చిన అపూర్వ స్పందనను ప్రజలంతా గమనించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దీన్ని విజయవంతంగా నిర్వహించామని మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.