
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి… రైతులకు భారీ ఊరట…
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి, యాసంగి 2025-26 సీజన్లో జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సమగ్ర జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న సేకరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), మట్టి రవాణా, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఏటీసీ ప్రవేశాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు.
జిల్లాలో 59,342 మంది రైతుల నుంచి 4.35 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి రూ.1,031 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటికే 93 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక వరి కొనుగోలు అని ఆయన వెల్లడించారు.
సీఎంఆర్ బియ్యం సరఫరాలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొంటూ, ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో లక్ష్యాలకు అనుగుణంగా సరఫరాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎక్కడా కోతలు పడకుండా చర్యలు తీసుకున్నామని, కొనుగోలు ప్రక్రియలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా అధిగమించామని చెప్పారు.
అలాగే జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయని, రైతులకు పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరిస్తూ, ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజల సహకారంతో మరింత సమర్థవంతమైన పాలన అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
