పోలీస్ డ్యూటీ మీట్‌తో నైపుణ్యాలకు పదును….

TEJA NEWS

పోలీస్ డ్యూటీ మీట్‌తో నైపుణ్యాలకు పదును….

రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు…

— సీపీ అంబర్ కిషోర్ ఝా…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, పోలీసు అధికారుల నైపుణ్యాలు, సామర్థ్యాలను మరింత మెరుగుపర్చేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం కమిషనరేట్ స్థాయి మూడవ పోలీస్ డ్యూటీ మీట్–2026 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు.

డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ డ్యూటీ మీట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, యాంటీ-సబోటేజ్ తనిఖీలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని, అక్కడ విజయం సాధించిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌లలో పాల్గొనే అవకాశం పొందుతారని పేర్కొన్నారు.

శాస్త్రీయ దర్యాప్తు, వేలిముద్రల విశ్లేషణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకోవడం, సంక్లిష్ట కేసుల పరిష్కారానికి అవసరమైన ఆలోచనలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాల్లో పోలీస్ డ్యూటీ మీట్ కీలక పాత్ర పోషిస్తుందని సీపీ తెలిపారు. ఈ వేదిక ద్వారా పోలీసు అధికారుల మధ్య పరస్పర సహకారం, వృత్తిపరమైన నైపుణ్యాలు మరింత పెరుగుతాయని అన్నారు.

పోటీల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి కాళేశ్వరం జోన్, రాష్ట్ర స్థాయిలో రామగుండం కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని సీపీ సూచించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్, ఏఓ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top