మాదకద్రవ్యాల సమాచారాన్ని పోలీసులకు అందించండి

Spread the love

మాదకద్రవ్యాల సమాచారాన్ని పోలీసులకు అందించండి….

ప్రతి విద్యార్థి ‘మాదకద్రవ్యాల వ్యతిరేక సైనికుడు’గా మారాలి…

–డీసీపీ బి. రామ్ రెడ్డి…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కమాన్‌పూర్ మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాదరావు, కమాన్‌పూర్ ఎస్‌ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని సహాయ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిందని తెలిపారు. ఈ లక్ష్యంతో ప్రత్యేకంగా “ఈగల్” విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు తాము మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇతరులను కూడా వాటి బారిన పడకుండా చైతన్యం కల్పించాలని కోరారు.

ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలిసిన వెంటనే 100 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాజాన్ని రక్షించడంలో ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరిస్తూ “మాదకద్రవ్యాల వ్యతిరేక సైనికుడు”గా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని పోలీసులకు అందించేందుకు సిద్ధమా అని డీసీపీ ప్రశ్నించగా, విద్యార్థులందరూ చేతులు ఎత్తి తమ మద్దతు ప్రకటించారు.

అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన “మాదకద్రవ్యాల వ్యతిరేక సైనికుడు” సెల్ఫీ కేంద్రం వద్ద విద్యార్థులు ఫోటోలు దిగారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీసీపీ బి. రామ్ రెడ్డి, ఏసీపీ ఎం. రమేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top