
“డ్రగ్స్‌కు దూరంగా… భవిష్యత్తుకు దగ్గరగా, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పెద్దపల్లిలో విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా వరకు విద్యార్థులు, పోలీసు అధికారులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు చైతన్యం కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, ఏసీపీ జి. కృష్ణ మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
డ్రగ్స్, గంజాయి, మద్యం, సిగరెట్లు వంటి వ్యసనాలకు దూరంగా ఉండి విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, అక్రమ రవాణా లేదా గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-100 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని, సమాచారదాతల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీసీపీ బి. రామ్ రెడ్డి తెలిపారు. మాదకద్రవ్యాలు కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీసి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు, ప్రజలతో కలిసి “మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాం… డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పెద్దపల్లి ఎస్ఐ నరేష్, రూరల్ ఎస్ఐ మధుకర్, ఎస్ఐ శ్వేత, పోలీసు అధికారులు, సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
