
గంజాయి రహిత సమాజం కోసం చేతులు కలిపిన విద్యార్థులు….
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి మార్గం…
–పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖనిలో పోలీసులు విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక మానవహారం నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలొద్దీన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్ హాజరై విద్యార్థులతో కలిసి మానవహారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలని అన్నారు. వ్యసనానికి గురైన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందిస్తోందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వ్యసనాన్ని శిక్షల ద్వారా కాకుండా చికిత్స, అవగాహన ద్వారా నిర్మూలించడం సాధ్యమవుతుందని పేర్కొంటూ, గంజాయి వినియోగం లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గోదావరిఖని సబ్‌డివిజన్‌లో ఈ మానవహారం నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణను గంజాయి, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్-100 లేదా 1908కు సమాచారం అందించాలని కోరారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సైలు మనోహర్, అనూష, ఉపాధ్యాయులు, విద్యార్థినీ-విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
