
“నేటి అవగాహనే.. రేపటి ప్రమాదాల నివారణ….
– తెలంగాణ ఎస్టీపీఎస్లో జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు ప్రారంభం….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (TSTPS)లో జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు–2026 జూన్ 26 నుంచి జూలై 2 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ సర్వీస్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఓపెన్ కార్ పార్కింగ్ ప్రాంగణంలో ప్రారంభోత్సవం, విద్యుత్ భద్రతపై సామూహిక అవగాహన కార్యక్రమం (మాస్ పెప్ టాక్) నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హెచ్ఓపీ (ఆర్ & టీ) సి. కె. సమంత, జీఎం (ఓ & ఎం) ముకుల్ రాయ్, జీఎం (ఎం & ఏడీఎం) అవిజిత్ దత్తా, జీఎం (పీ) బినోయ్ జోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించడం, కార్యాలయాల్లో సురక్షితమైన పని విధానాలను అలవర్చడం, ప్రమాదాలను నివారించే భద్రతా సంస్కృతిని బలోపేతం చేయడం.
కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ప్రమాదాలను నివారించేందుకు సామూహిక ప్రతిజ్ఞ చేశారు. వారోత్సవం సందర్భంగా వివిధ భద్రతా అవగాహన కార్యక్రమాలు, శిక్షణా సదస్సులు, భద్రతా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అన్ని విభాగాల ఉద్యోగులు తమ బృందాలు, కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని యాజమాన్యం కోరింది.
ఈ ఏడాది జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల థీమ్ “నేటి అవగాహనే… రేపటి ప్రమాదాల నివారణ” గా నిర్ణయించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ఇతర విద్యుత్ ప్రమాదాలను నిరోధించడంలో నిరంతర అప్రమత్తత, అవగాహన అత్యంత కీలకమని ఈ థీమ్ ద్వారా సందేశం అందించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
