
మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాగూర్
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: హైదరాబాద్ రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత కీలకమైన 1×800 మెగావాట్ల బి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఆయన రామగుండం ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది రామగుండం ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
అదేవిధంగా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్గత రహదారుల విస్తరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సౌకర్యాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ఆధునిక పట్టణ సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు రామగుండం రాష్ట్రంలో ఆదర్శ పారిశ్రామిక నగరంగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ వినతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రామగుండం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
