
ప్రజల ఆరోగ్యంతో రాజీ లేదు…
ఆహార భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, జిల్లాలోని హోటళ్లు, భోజనశాలల్లో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
ఆహార పదార్థాల నిల్వ, తయారీ, పరిశుభ్రత, వడ్డింపు వంటి అన్ని అంశాల్లో ఆహార భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హోటళ్లు, భోజనశాలల్లో పనిచేసే సిబ్బందికి ఆహార భద్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించి, వినియోగదారుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, భోజనశాలలను తాత్కాలికంగా మూసివేసి, లోపాలను పూర్తిగా సరిదిద్దిన అనంతరం మాత్రమే తిరిగి నిర్వహణకు అనుమతులు ఇస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
మే 29న మంథని మార్కెట్ ప్రాంతంలోని శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మెస్, జూన్ 13న. గోదావరిఖనిలోని డెస్టినేషన్ రెస్టారెంట్లో ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడంతో ఆయా సంస్థలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు.
తదనంతరం ఆయా సంస్థల నిర్వాహకులు పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేపట్టడంతో, అధికారుల పునఃపరిశీలన అనంతరం శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మెస్‌కు జూన్ 4న, డెస్టినేషన్ రెస్టారెంట్‌కు జూన్ 30న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలోని ఇతర హోటళ్లు, భోజనశాలల్లో కూడా ఆహార భద్రత అధికారుల ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఎక్కడైనా అపరిశుభ్రత లేదా నిబంధనల ఉల్లంఘన గుర్తించిన వెంటనే సంబంధిత సంస్థలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
హోటల్, భోజనశాలల నిర్వాహకులు ఆహార భద్రత నిబంధనలను తూచా తప్పకుండా పాటించి ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
