మాతృ మరణాలకు తావులేకుండా వైద్య సేవలు అందించాలి…

Spread the love

మాతృ మరణాలకు తావులేకుండా వైద్య సేవలు అందించాలి…

గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, గర్భిణీలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 2025–26 సంవత్సరానికి సంబంధించిన మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో జరిగిన మాతృ మరణాల వంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో మాతృ మరణాల సంఖ్య సున్నాగా ఉండేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గర్భిణీలకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అధిక ప్రమాద సూచనలు ఉన్న గర్భిణీలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

గర్భిణీలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు, సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి గర్భిణీలకు అవసరమైన వైద్య సహాయాన్ని సకాలంలో అందించాలని, మాతృ మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పవిత్ర, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి శ్రీధర్, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top