స్వచ్ఛ రామగుండం నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరం….

Spread the love

స్వచ్ఛ రామగుండం నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరం….

చెత్తను రోడ్లు, డ్రైనేజీల్లో వేస్తే జరిమానాలు తప్పవు – నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి

–మేయర్ మహంకాళి స్వామి…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:రామగుండం
అందమైన, పరిశుభ్రమైన రామగుండం నగర నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయ్‌నగర్ పవర్ హౌస్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ కంకణాల మౌనికతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు గత ఐదు నెలలుగా డ్రైనేజీల్లో పూడికతీత పనులను ప్రత్యేకంగా చేపడుతున్నామని తెలిపారు. ఒకవైపు నగర పాలక సంస్థ కాలువలను శుభ్రం చేస్తుంటే, మరోవైపు కొందరు అదే కాలువల్లో చెత్త వేయడం వల్ల సమస్య మళ్లీ మొదటికి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు అవగాహన కల్పించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇకపై రోడ్లు, డ్రైనేజీల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించక తప్పదని హెచ్చరించారు. కేవలం రూ.50 చెల్లిస్తే నెల రోజుల పాటు ఇంటి వద్ద నుంచే చెత్త సేకరణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.

“స్వచ్ఛ రామగుండం” లక్ష్య సాధనలో ప్రజలందరూ సహకరించాలని కోరిన మేయర్, ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి చేస్తున్నారని, ప్రజలు ఆయనకు పూర్తి సహకారం అందించాలని అన్నారు.

గంగా నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని సర్వీస్ రోడ్డు వెంబడి అక్రమ నిర్మాణాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాటిని తొలగించినట్లు తెలిపారు. అలాగే రహదారికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలను వెనక్కి తరలించాలని ఎన్‌పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

దశాబ్దకాలంగా శుభ్రం చేయని ప్రధాన డ్రైనేజీలను యంత్రాల సహాయంతో పూడిక తొలగించి పూర్తిగా శుభ్రం చేసినట్లు మేయర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డీఈఈ శ్రీకాంత్, ఏఈ తేజస్విని, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ మధుకర్, శానిటరీ జవాన్ సోమేష్, వాటర్ సప్లై సూపర్వైజర్ శశికుమార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top