
పెద్దపల్లిలో క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ పరిశీలన…
మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు…
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదు సమీపంలోని 33వ వార్డు భారత్‌నగర్, 19వ వార్డు బండారికుంట ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు సవరణ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే ఈ ప్రక్రియలో అధికారులు అత్యంత బాధ్యతతో పనిచేయాలని అన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వారి సందేహాలను వెంటనే నివృత్తి చేసేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సమైక్య సంఘాల సభ్యుల సహకారంతో ఎన్యూమరేషన్ ఫారాలను ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీలో రెవెన్యూ విభాగాధికారి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
