కార్మికులకు పనిముట్లు లేవు… ఐఏఎస్‌ల పేరుతో నజరానాలా…?

TEJA NEWS

కార్మికులకు పనిముట్లు లేవు… ఐఏఎస్‌ల పేరుతో నజరానాలా…?

సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించిన ఏఐటియుసి…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, సింగరేణి కార్మికులకు అవసరమైన కనీస పనిముట్లు, భద్రతా పరికరాలు కూడా అందించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని, మరోవైపు ఐఏఎస్‌ల పేరుతో లక్షల రూపాయల నజరానాలు ప్రకటించడం ఏమిటని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను ప్రశ్నించారు.

విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత రెండు నెలలుగా కార్మికులకు డ్రిల్ బిట్స్, డ్రిల్ రాడ్స్, కీలలు, పట్టీలు, గిర్మిట్లు, స్మాల్ మ్యాన్ క్లిప్స్, రెజిన్ క్యాప్సూల్స్, రక్షణ పరికరాలు, బూట్లు, టోపీలు, గ్లౌజులు, ఎస్‌డీఎల్‌ల నిర్వహణకు అవసరమైన సామగ్రి, టెక్నీషియన్లకు అవసరమైన ఆధునిక టూల్స్ వంటి కనీస పనిముట్లు కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు.

ఒకవైపు కార్మికులకు అవసరమైన సామగ్రి అందించలేని యాజమాన్యం, మరోవైపు ఎవరో తెలియని వ్యక్తులకు ఐఏఎస్‌ల పేరుతో నజరానాలు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సింగరేణి నిధులను వినియోగించడం వల్ల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థపై మరింత భారం పడుతోందని విమర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ కార్యక్రమానికి రూ.10 కోట్లు, ప్రభుత్వ జాబ్ మేళాలకు నిధులు కేటాయించడం, రాయల్టీలు, సెస్సులు, డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం సంస్థ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఇది ప్రభుత్వ ప్రచారానికి సంస్థను వినియోగించే ప్రయత్నమని, చివరికి సింగరేణిని బలహీనపర్చి ప్రైవేట్ శక్తులకు అప్పగించే కుట్రలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.

తక్షణమే కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు సరఫరా చేయాలని, నజరానాల పేరుతో జరుగుతున్న ఖర్చులను నిలిపివేయాలని, సింగరేణి వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని, ఆర్థిక అరాచకాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.

సింగరేణి సంస్థ కార్మికుల శ్రమ, చెమటతో నడుస్తోందని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్మికులు వాస్తవాలను గుర్తించి నిజాయితీగా కార్మిక హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్లకు మద్దతుగా నిలవాలని, ఏఐటియుసి చేపట్టే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని రంగు శ్రీను పిలుపునిచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top