ముందంజలో ఉన్న పెద్దపల్లి విమానాశ్రయాన్ని పక్కన పెట్టడం అన్యాయం….

Spread the love

ముందంజలో ఉన్న పెద్దపల్లి విమానాశ్రయాన్ని పక్కన పెట్టడం అన్యాయం….

సాధించే వరకు పోరాటం చేస్తాం ఎంపీ గడ్డం వంశీకృష్ణ…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి, కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముందుకు వెళ్తూ, ముందంజలో ఉన్న పెద్దపల్లి విమానాశ్రయ ప్రతిపాదనను పక్కన పెట్టడం అన్యాయమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు సందర్భాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి పెద్దపల్లి విమానాశ్రయాన్ని అత్యవసరంగా మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఉడాన్ (UDAN) పథకం కింద పెద్దపల్లికి విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లేదా సానుకూల నిర్ణయం రాలేదని పేర్కొన్నారు.

సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతంగా, పారిశ్రామిక మరియు వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా పెద్దపల్లి ఎదుగుతోందని, ఈ ప్రాంతంలో విమానాశ్రయానికి గణనీయమైన ప్రయాణికుల డిమాండ్‌తో పాటు ఆదాయ అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. అయినప్పటికీ రాజకీయ కారణాలతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టడం విచారకరమని విమర్శించారు.

పెద్దపల్లి ప్రజల న్యాయమైన హక్కు కోసం పార్లమెంట్‌లో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తానని, అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపట్టి విమానాశ్రయాన్ని సాధించే వరకు పోరాటం కొనసాగిస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.
పెద్దపల్లి అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణకు విమానాశ్రయం అత్యంత అవసరమని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే పెద్దపల్లి విమానాశ్రయానికి ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top