రామగుండం లోని అటవీ – రెవెన్యూ భూముల పరిశీలన

Spread the love

అదనపు తరగతి గదుల నిర్మాణాలు వేగవంతం చేయాలి…..

నాణ్యతలో రాజీ వద్దు.. అటవీ–రెవెన్యూ సరిహద్దు వివాదాలను సంయుక్త సర్వేతో పరిష్కరించాలి….

— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

పెద్దపల్లి జిల్లా ప్రతినిథి,
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించే లక్ష్యంతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

రామగుండం ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్, ప్రభుత్వ ఐటీఐ సమీపంలో కొనసాగుతున్న అటవీ–రెవెన్యూ సరిహద్దు సర్వేను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనులను తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించేలా అత్యున్నత ప్రమాణాలతో పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్మాణ సామగ్రి నుంచి పనుల అమలు వరకు ప్రతి అంశాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అనంతరం ప్రభుత్వ ఐటీఐ సమీపంలో కొనసాగుతున్న అటవీ–రెవెన్యూ సరిహద్దు సర్వేను పరిశీలించిన కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని ఆదేశించారు. సంబంధిత రికార్డుల ఆధారంగా పారదర్శకంగా సర్వే పూర్తి చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.

ఈ పర్యటనలో పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ నాయుడు, సహాయ ఇంజనీర్ రాజ్‌కుమార్, పెద్దపల్లి అటవీ పరిధి అధికారి టి. సతీష్ కుమార్, బీట్ అధికారి ప్రదీప్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top